Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం కలగడం లేదు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానంగా ఇచ్చిన ఈ ఇందిరమ్మ ఇండ్లను గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు క్రమంగా ఇండ్ల సర్వే పూర్తయి, లబ్ధిదారుల ఎంపిక దశకు వచ్చింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందాలంటే ఓ మెలిక పెట్టింది. దీంతో ఇందిరమ్మ ఇండ్లపై నీలినీడలు కమ్ముకుంటాయా? రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరించి ఇస్తుందా? అన్న విషయాలపై అయోమయం నెలకొన్నది.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.5 లక్షల సాయం చేస్తామని ప్రకటించింది. దీనికోసం నమూనా ఇంటిని రూపొందించింది. ఉండాల్సిన స్థలం, విధివిధానాలను ప్రకటించింది. విడతల వారీగా నగదు సాయాన్ని అందజేస్తామని వెల్లడించింది. లబ్ధిదారులను కూడా విభజించి, ఇండ్ల స్థలం ఉండి ఇల్లు లేనివారికి ఒక విడత, ఇండ్ల స్థలమే లేని వారికి మరో విడుత ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే యాప్ ద్వారా సర్వే నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేసింది. తొలి విడత నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Indiramma Indlu: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.5 లక్షల నగదు సాయంలో కేంద్రం నుంచి సాయం కోరింది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తాము రూపొందించిన యాప్‌లోనే సర్వే చేయాలని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే కాదని, మళ్లీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సభల ద్వారా దరఖాస్తులు సేకరించినా, తాము రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
Indiramma Indlu: ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జాప్యం కావడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నామని, మళ్లీ లక్షలాది మందికి రీసర్వే చేయాలంటే ప్రజల్లో తమపై నమ్మకం పూర్తిగా పోతుందని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల భారం మొత్తం రాష్ట్రప్రభుత్వంపైనే పడనున్నది. కానీ, నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిధులను ఎలా భరిస్తుందనే మీమాంస నెలకొన్నది. అయోమయంలో పడిన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు భరిస్తుందా? కేంద్రం ఆదేశించినట్టు మళ్లీ సర్వే చేసి, కేంద్రం భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదా? అన్న విషయాలు త్వరలోనే తేలనున్నాయి.