IndiGo Flights: దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ నికర లాభం ఏకంగా 78 శాతం తగ్గి రూ. 549.1 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ. 2,448.8 కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ ప్రభావంతో నేడు (శుక్రవారం) స్టాక్ మార్కెట్‌లో ఇండిగో షేర్లు సుమారు 4 శాతం వరకు నష్టపోయాయి.
ఇండిగో లాభాలు భారీగా తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలను కంపెనీ పేర్కొంది. గతేడాది డిసెంబర్ ప్రారంభంలో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర అంతరాయాల వల్ల కంపెనీకి రూ. 577.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనికి తోడు కొత్త లేబర్ కోడ్ (కార్మిక చట్టాలు) అమలు చేయడం వల్ల మరో రూ. 969.3 కోట్ల భారం పడింది. మొత్తంగా ఈ క్యూ3లో కంపెనీపై సుమారు రూ. 1,546.5 కోట్ల వన్-టైమ్ భారం పడినట్లు వెల్లడించింది. విమానాల రద్దు, జాప్యం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు గాను డీజీసీఏ (DGCA) ఇండిగోకు రూ. 22.2 కోట్ల జరిమానా కూడా విధించింది.
ఇది కూడా చదవండి: Champion OTT: ఛాంపియన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
కంపెనీ ఫలితాలు అంచనాల కంటే దారుణంగా ఉండటంతో మదుపర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈ (BSE)లో ఇండిగో షేరు ధర 3.87 శాతం క్షీణించి రూ. 4,723.60 వద్దకు పడిపోయింది. అటు ఎన్ఎస్ఈ (NSE)లో కూడా 3.79 శాతం తగ్గి రూ. 4,722.50 వద్ద ట్రేడ్ అయ్యింది. ఒక్క రోజే ఇంత భారీ స్థాయిలో ధర పడిపోవడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా హరించుకుపోయింది.
లాభాలు తగ్గినప్పటికీ, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం గత ఏడాది కంటే 7 శాతం పెరిగి రూ. 24,540.6 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు దాదాపు 2,500 విమానాలు రద్దు కావడం, వేలాది విమానాలు ఆలస్యం కావడంతో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు చక్కబడ్డాయని, ఫిబ్రవరి 10 నాటికి విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ధీమా వ్యక్తం చేశారు.
