Shamshabad Airport: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సర్వీసులలో నెలకొన్న సంక్షోభం కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈరోజు ఒక్కరోజే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి రాకపోకలు సాగించాల్సిన మొత్తం 115 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. రద్దు అయిన వాటిలో… ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 54 విమానాలు, ఇక్కడి నుండి వెళ్లాల్సిన 61 విమానాలు ఉన్నాయి. ఈ పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: IndiGo: ఇండిగో సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు..
ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, రైల్వే, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. ముంబయి, దిల్లీ, పుణె, హావ్‌డా వంటి ప్రధాన నగరాల నుండి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 100 కంటే ఎక్కువ ట్రిప్పులతో 89 ప్రత్యేక రైలు సర్వీసులను మూడు రోజుల పాటు బహుళ జోన్ల మీదుగా నడుపుతున్నారు. రైల్వేశాఖ అదనంగా 37 రైళ్లకు అదనపు కోచ్‌లు కూడా జోడించి నడుపుతోంది. అంతేకాక, జీఎంఆర్ సంస్థ సహకారంతో తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ లోటును పూడ్చేందుకు స్పైస్‌జెట్ విమాన సంస్థ కూడా దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చి, ప్రయాణికులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది.

