Fancy Number: ఆటోమొబైల్ రంగంలో వీఐపీ నంబర్ ప్లేట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ వాహనానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎంత భారీ ధరనైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ కోవలోనే, దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు ఒకటి తాజాగా హర్యానాలో నమోదైంది.
హర్యానా రవాణా శాఖ నిర్వహించిన వీఐపీ నంబర్ ప్లేట్ల ఆన్లైన్ వేలంలో, ‘HR88B8888’ అనే నంబర్ ఏకంగా రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైంది. కేవలం రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ కోసం 45 మంది బిడ్డర్లు నువ్వా-నేనా అంటూ పోటీ పడ్డారు. వేలంలో దీని ధర నిమిషానికోసారి పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకే రూ. 88 లక్షలకు చేరుకోగా, చివరకు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్ల వద్ద వేలం ముగిసి, దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్‌గా రికార్డు సృష్టించింది.
‘8’ లక్కీ నంబర్ మాయ!
ఈ నంబర్ ప్లేట్ ఇంతటి రికార్డు ధర పలకడానికి ప్రధాన కారణం అందులో ఉన్న ప్రత్యేక ఆకర్షణే. ‘HR88B8888’ నంబర్లో వరుసగా ఉన్న నాలుగు ఎనిమిదులు (8888) అదృష్టాన్ని, శ్రేయస్సును సూచిస్తాయని భావించడం ఒక కారణం. అంతేకాకుండా, ఈ నంబర్ ప్లేట్లో ఉండే వాహన సిరీస్ అక్షరం ‘B’ ఆకారం అచ్చం ‘8’ అంకెను పోలి ఉండడం మరో విశేషం. దీంతో ఈ నంబర్ ప్లేట్ మొత్తం కూడా వరుసగా ఎనిమిదుల శ్రేణిలా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: PM Vidya Lakshmi Yojana: చదవడానికి డబ్బులు లేవ.. వెంటనే పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి!
ఈ రిజిస్ట్రేషన్ కోడ్‌లో HR అంటే హర్యానా రాష్ట్ర కోడ్, 88 అంటే RTO కోడ్, B వాహన సిరీస్. మొత్తం నంబర్ ప్లేట్ ఎనిమిదుల శ్రేణిలా కనిపించడం దీనిని అత్యంత విలువైనదిగా మార్చింది. దీనికి ముందు, గత వారం ‘HR22W2222’ నంబర్ కూడా రూ. 37.91 లక్షలకు అమ్ముడైంది. అయితే, ‘HR88B8888’ నంబర్ ప్లేట్ రూ. 1.17 కోట్ల ధరకు అమ్ముడవడం భారతదేశంలో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న పెరుగుతున్న డిమాండ్‌కి తిరుగులేని ఉదాహరణగా నిలిచింది.
హర్యానా ప్రభుత్వం ప్రతి వారం fancy.parivahan.gov.in పోర్టల్ ద్వారా ఈ వీఐపీ నంబర్లకు ఆన్లైన్ వేలం నిర్వహిస్తుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే నమోదులు సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగి, బుధవారం సాయంత్రం 5 గంటలకు వేలం ఫలితాలు వెలువడతాయి.
