Dengue Vaccine: భారత దేశంలో డెంగ్యూ వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతీ ఏడాది వేలాదిమంది ఈ వ్యాధికి గురవుతున్నారు. డెంగ్యూ నివారణ కోసం టీకా అవసరం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ సమస్యకు పరిష్కారంగా దేశీయంగా తయారైన డెంగ్యూ వ్యాక్సిన్ ‘డెంగిఆల్’ త్వరలో అందుబాటులోకి రానుంది.
పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా
పనాసియా బయోటెక్ అనే భారతీయ కంపెనీ, అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లకు (సెరోటైప్ 1, 2, 3, 4) వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీన్ని ‘టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. అంటే ఇది సజీవమైన కానీ బలహీనపరిచిన వైరస్‌ను ఉపయోగించి తయారు చేసిన టీకా.
ట్రయల్స్ చివరి దశలో
ఈ టీకా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. భారత్‌లోని 20 కేంద్రాలలో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటికే 8,000 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. అక్టోబర్ నాటికి మొత్తం 10,500 మంది టీకా పరీక్షలలో భాగంగా చేరనున్నారు. ఈ ట్రయల్స్ పూణే, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్ వంటి నగరాల్లో జరుగుతున్నాయి.
శాస్త్రీయంగా పరీక్షలు
ఈ వ్యాక్సిన్‌ను ICMR ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ వంటి సంస్థలు సంయుక్తంగా పరిశీలిస్తున్నాయి. ఈ ట్రయల్స్‌ను చాలా శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. టీకా ప్రభావాన్ని, భద్రతను, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేయడానికి వాలంటీర్లను రెండేళ్లపాటు పరిశీలిస్తారు.
ఇది కూడా చదవండి: Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?
దేశంలో డెంగ్యూ తీవ్రత
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి తీవ్రమవుతుంది. ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 2024లో ఇప్పటివరకు దాదాపు 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదయ్యాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు లేకుండా ఉన్న 75% కేసులు ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేస్తుంటాయి. పిల్లల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పెద్దవారిలో కూడా డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
భవిష్యత్తులో ఆశ
ఈ టీకా విజయవంతమైతే, డెంగ్యూని ఎదుర్కొనడంలో భారత్‌కు గొప్ప విజయంగా నిలుస్తుంది. దేశీయంగా తయారైన టీకా కావడం వల్ల దాని ఖర్చు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలోనే డెంగ్యూకి సరైన వ్యాక్సిన్ అరుదుగా ఉండే నేపథ్యంలో, ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు కావొచ్చు.

