America: బయటి దేశానికి వెళ్లి చదువుకోవాలని భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరు పలు ఉన్నతస్థాయి విద్యలు అభ్యసిస్తున్నారు. 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అత్యధిక సంఖ్యలో బారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. ఈ విషయం సోమవారం వెల్లడైన ఓపెన్ డోర్స్ రిపోర్టు 2024తో స్పష్టం అయింది. అంతకు ముందు ఏడాది అంటే 2022-23లో అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంది.
తరువాతి స్థానంలో ఇండియా నిలిచింది. ఇప్పుడు చైనా రెండో స్థానంలోకి వెళ్లి ఇండియా మొదటి స్థానానికి వచ్చింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు 29 శాతం వరకూ ఉన్నారని పేర్కొన్న ఈ నివేదిక వివరాలను యుఎస్ ఎంబసీ వెల్లడించింది. అమెరికాలో విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఆరంభమై మే వరకూ ఉంటుంది.
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులు 3,31,602 మంది కాగా.. తర్వాత చైనా(2,77,398) రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా మూడవ స్థానంలో (43,149), కెనడా నాల్గవ స్థానంలో (28,998), తైవాన్((23,157)) ఐదవ స్థానంలో ఉన్నాయి ది ఓపెన్ డోర్స్ నివేదికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రచురించింది.