Rupee Value: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్షీణించి, 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం మార్కెట్ ప్రారంభంలోనే పతనం మొదలవగా, ఒకానొక దశలో 77 పైసల మేర కోల్పోయి 91.73 వద్ద స్థిరపడింది. గత డిసెంబర్‌లో మొదటిసారి 91 మార్కును దాటిన రూపాయి, ఇప్పుడు అంతకంటే దిగువకు పడిపోవడం గమనార్హం.
ఈ భారీ పతనానికి ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం ఒక కారణమైతే, బంగారం, వెండి దిగుమతులు విపరీతంగా పెరగడం మరో కారణంగా నిలిచింది. వీటితో పాటు అమెరికా-ఐరోపా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి.
Also Read: Chandrababu Naidu: పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ.. అంతర్జాతీయ చర్చపై చంద్రబాబు ధీమా
రానున్న రోజుల్లో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరితేనే రూపాయి మళ్లీ కోలుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఒప్పందం కుదరని పక్షంలో 2026లో రూపాయి విలువ 89 నుంచి 93 మధ్య ఊగిసలాడవచ్చు. ఒకవేళ సానుకూల ఒప్పందం కుదిరి, భారత వస్తువులపై అమెరికా పన్నులు తగ్గిస్తే రూపాయి విలువ 87.50 స్థాయికి పెరిగే అవకాశం ఉంది.
