New Railway Fares: రైలు ప్రయాణికులకు భారత రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈరోజు (జూన్ 30) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు, తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు సర్క్యులర్ జారీ చేసింది.
తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి:
జులై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే వారికి ఆధార్ నంబర్ తప్పనిసరి అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అనధికారికంగా టికెట్లను బుక్ చేసేవారిని నిరోధించడంతో పాటు, నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు సక్రమంగా అందేలా చూడటమే ఈ నిబంధన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
పెరిగిన ఛార్జీలు ఇలా:
వివిధ తరగతుల రైలు టికెట్లపై ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఈ పెంపు దూరాన్ని బట్టి మారుతుంది:
సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణం: 500 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలే వర్తిస్తాయి.
501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు ప్రయాణిస్తే టికెట్‌పై రూ. 5 అదనంగా చెల్లించాలి.
1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు ప్రయాణిస్తే టికెట్‌పై రూ. 10 అదనంగా చెల్లించాలి.
2501 కి.మీ నుంచి 3000 కి.మీ వరకు ప్రయాణిస్తే టికెట్‌పై రూ. 15 అదనంగా చెల్లించాలి.
ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లు: ప్రతి కిలోమీటరుకు అరపైసా (0.5 పైసా) చొప్పున ఛార్జీ పెరిగింది.
మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్ ఏసీ) రైళ్లు:
నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై ప్రతి కిలోమీటరుకు ఒక పైసా (1 పైసా) చొప్పున పెరిగింది. అన్ని రకాల రైళ్లలో ఏసీ తరగతులు (ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్): ప్రతి కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీ పెరిగింది.
Also Read: Narendra Modi: సంగారెడ్డి దుర్ఘటనలో మరణించిన వారికి రూ. 2 ఎక్స్-గ్రేషియా.. ప్రకటించిన మోదీ
ముఖ్యమైన గమనిక:
రిజర్వేషన్ ఛార్జీలు (రిజర్వేషన్ ఫీజు), సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదు. అవి పాత ధరల ప్రకారమే కొనసాగుతాయి. ఈ కొత్త ఛార్జీలు జులై 1, 2025 అర్ధరాత్రి 12 గంటల తర్వాత బుక్ చేసే టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి.
ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న పాత టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఈ మార్పులతో రైల్వే శాఖ తన ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ముందు కొత్త ఛార్జీల పట్టికను ఒకసారి చూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

