India Women Cricket Team: భారత మహిళల క్రికెట్ జట్టు 2025 సీజన్‌ను అద్భుతమైన విజయంతో ముగించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ సేన 5-0తో కైవసం చేసుకుని ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరితమైన ఆఖరి పోరులో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించి, వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న హర్మన్‌ప్రీత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ షెఫాలీ వర్మ (5) త్వరగానే వెనుదిరగ్గా, అరంగేట్రం చేసిన జి. కమలిని (12), హర్లీన్ డియోల్ (13) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా విఫలం కావడంతో ఒక దశలో భారత్ 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. ఆమెకు అమన్‌జోత్ కౌర్ (21) చక్కని సహకారం అందించింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో హైదరాబాదీ ప్లేయర్ అరుంధతి రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్సర్) సాధించి భారత్ స్కోరును 175/7కు చేర్చింది.
లకట బౌలర్ల పోరాటం వృథా 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. లంక కెప్టెన్ చామరి ఆటపట్టు (2)ను అరుంధతి రెడ్డి అవుట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చింది. అయితే మరో ఓపెనర్ హసిని పెరీరా (65), ఇమేషా దులాని (50) మెరుపు అర్ధశతకాలతో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించడంతో లంక ఒక దశలో గెలిచేలా కనిపించింది. కానీ అమన్‌జోత్ కౌర్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో లంక నిర్ణీత ఓవర్లలో 160/7 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
Also Read: Gautam Gambhir: గౌతమ్ గంభీర్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు ఈ మ్యాచ్ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నీలాక్షికను అవుట్ చేయడం ద్వారా దీప్తి అంతర్జాతీయ మహిళా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. 152 వికెట్లతో ఆమె ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ (151 వికెట్లు) రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
అవార్డుల పంట అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా, సిరీస్ అంతటా రాణించిన షెఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. భారత మహిళల జట్టు టీ20 సిరీస్‌లో 5-0తో క్లీన్‌స్వీప్ చేయడం ఇది మూడోసారి కాగా, సొంతగడ్డపై ఇదే మొదటిసారి కావడం విశేషం.
