Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా చమురు వాణిజ్యం విషయంలో భారత్ పై ఒత్తిడి తెస్తున్నందుకు అమెరికాను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి మద్దతు ఇస్తూ, భారత్ అవమానాన్ని అంగీకరించదని వ్యాఖ్యానించారు. రష్యాలోని సోచిలో జరిగిన వాల్దై డిస్కషన్ క్లబ్ సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేయకుండా భారత్‌ను ఆపడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ఖండించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోరని ఆయన బలంగా పేర్కొన్నారు.భారత్ రాజకీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను ఆ దేశ ప్రజలు నిశితంగా గమనిస్తారని, వారు తమను తాము ఎవరి ముందు అవమానించుకోవడానికి అంగీకరించరని ఆయన అన్నారు.
Also Read: Droupadi Murmu: సోదరభావాన్ని పెంపొందించే వేదిక ‘అలయ్ బలయ్’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
పుతిన్ ప్రధాని మోదీని సమతుల్యమైన, తెలివైన, జాతీయ దృక్పథం కలిగిన నాయకుడుగా ప్రశంసించారు. తమ ఇరువురి మధ్య నమ్మకంతో కూడిన సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం అనేది కేవలం ఆర్థికపరమైన లెక్కే తప్ప, ఇందులో ఎలాంటి రాజకీయ అంశం లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ రష్యా ఇంధన సరఫరాలను నిలిపివేస్తే, అది సుమారు $9 బిలియన్ల (సుమారు ₹75,000 కోట్లు) నుండి $10 బిలియన్ల వరకు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. రష్యా ఇంధన దిగుమతులపై భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తెస్తున్న అమెరికా, తానే రష్యా నుంచి యురేనియం వంటి ఇతర వనరులను కొనుగోలు చేస్తోందని, ఇది “కపటత్వం (Hypocrisy)” అని పుతిన్ ఆరోపించారు. రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలు స్వాతంత్ర్యం కోసం భారత్ పోరాడుతున్నప్పటి నుంచి ఉన్నాయని, ఆ ప్రత్యేక బంధాన్ని భారత్ గుర్తుంచుకుందని, తాము దాన్ని గౌరవిస్తామని పుతిన్ చెప్పారు.