India: బంగ్లాదేశ్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లోకి నిరసనకారులు చొరబడేందుకు ప్రయత్నించారన్న కథనాలను పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఈ అంశంపై ఎలాంటి భద్రతా లోపం జరగలేదని, కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే శాంతియుతంగా నిరసన తెలిపారని స్పష్టం చేసింది. వారు నినాదాలు చేయడం వరకే పరిమితమయ్యారని, హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారన్న ప్రచారంలో నిజం లేదని భారత్ తేల్చిచెప్పింది.
ఈ నిరసనలు బంగ్లాదేశ్‌లో జరిగిన దీపూ చంద్ర దాస్ హత్యను నిరసిస్తూ నిర్వహించబడినవని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్ బంగ్లాదేశ్‌లోని మయమన్సింగ్ జిల్లాలో ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్‌ను బంగ్లాదేశ్ తిరస్కరించడంతో పాటు, తమ మీడియా వాస్తవాలనే ప్రచురించిందని స్పష్టం చేసింది. దీనిపై భారత్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Brahmanandam: ముర్ముకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!
ఇదిలా ఉండగా, బంగ్లా యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణానంతరం చటోగ్రామ్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలు భారత్‌ను అప్రమత్తం చేశాయి. ఆ అల్లర్ల సమయంలో చటోగ్రామ్‌లోని అసిస్టెంట్ ఇండియన్ కమిషనర్ నివాసంపై రాళ్ల దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా కారణాలతో చటోగ్రామ్‌లోని భారత దౌత్య కేంద్రంలో వీసా సేవలను నిరవధికంగా నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ఆదివారం నుంచే అమల్లోకి వచ్చిందని ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వీసాల మంజూరు నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగనున్నట్లు సమాచారం. భారత్–బంగ్లాదేశ్ మధ్య తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయని దౌత్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
