టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..

టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కాన్పూర్ వేదికగా భారత్– బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన అనంతరం వర్షం కురవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. వర్షం, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా మూడో రోజు కూడా ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులు ఆట మాత్రమే మిగిలి ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో భారత్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా భారత్ మొదట బంగ్లాదేశ్‌ను కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేసింది. 126 పరుగులకు మిగతా ఏడు వికెట్లను చేజిక్కించుకుంది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ లు తొలి ఓవర్ నుంచి విధ్వంసానికి తెరలేపారు. భారీ బౌండరీలతో విరుచుకుపడిన రోహిత్, జైస్వాల్ లు.. కేవలం 3 ఓవర్లలో అర్థ శతక భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో అత్యంత వేగంగా అర్ధశతకం పూర్తి చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.

ఈ ఏడాది ప్రారంభంలో ట్రెంట్ బ్రిడ్జ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4.2 ఓవర్లలో 50 పరుగుల చేసిన ఇంగ్లండ్ రికార్డును ఇప్పుడు భారత్ బ్రేక్ చేసింది. కాగా, 2008లోనూ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం 5.3 ఓవర్లలోనే భారత్ నమోదు చేసింది. ఇంగ్లండ్ ఈ జాబితాలో వరుసగా 2024, 1994, 2002లో 4.2, 4.3, 5 ఓవర్లలో అర్థశతకం సాధించింది. ఇక, 2004లో పాకిస్థాన్‌పై కేవలం 5.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరిన జాబితాలో శ్రీలంక కూడా ఉంది.

అత్యంత వేగంగా శతకం పూర్తి చేసిన జట్టుగా కూడా టీమిండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కేవలం 10.1 ఓవర్లలో 100 పూర్తి చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ కేవలం 12.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో భారత్ టెస్టుల్లో తన రికార్డును తానే బ్రేక్ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *