Internet Users: దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. గడిచిన ఏడాది కాలంలో భారత ఇంటర్నెట్ రంగం అనూహ్యమైన వృద్ధిని సాధించిందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ వెల్లడించింది. 2024లో 88.6 కోట్లుగా ఉన్న అంతర్జాల వినియోగదారుల సంఖ్య, 2025 నాటికి 95.8 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 8 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో ఒకటిగా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఈ తాజా గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, దేశంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉండటం. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి నాలుగు రెట్లు వేగంగా జరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం సుమారు 54.8 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నారు. కనెక్టివిటీ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు స్మార్ట్‌ఫోన్ల లభ్యత పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
Also Read: P. T. Usha: PT ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందున్నారు. ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 44 శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వాయిస్ సెర్చ్, చాట్‌బాట్‌లు, ఏఐ ఫిల్టర్ల వాడకం యువతలో ఎక్కువగా ఉంది. దీనితో పాటు, వినోద రంగంలో షార్ట్ వీడియోల హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 58.8 కోట్ల మంది వినియోగదారులు షార్ట్ వీడియోలను వీక్షిస్తూ డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇ-కామర్స్ రంగం కూడా పట్టణ ప్రాంతాల్లో 56 శాతం మంది వినియోగదారులతో వేగంగా విస్తరిస్తోంది.
ఇంతటి భారీ వృద్ధి ఉన్నప్పటికీ, దేశ జనాభాలో సుమారు 38 శాతం మంది, అంటే 57.9 కోట్ల మంది ఇంకా ఇంటర్నెట్ సేవలకు దూరంగానే ఉన్నారని నివేదిక గుర్తు చేసింది. ఇందులో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 19.3 కోట్ల మంది వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో (Multi-device) ఇంటర్నెట్ వాడుతుండగా, గ్రామాల్లో మాత్రం చాలా మంది ఇతరుల మొబైల్ హాట్‌స్పాట్ సాయంతోనే నెట్ వాడుతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించే దిశగా మౌలిక సదుపాయాల కల్పన జరిగితే భవిష్యత్తులో భారత్ డిజిటల్ శక్తిగా మరింత ఎదిగే అవకాశం ఉంది.
