IND vs AUS: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో భారత టీమ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత బౌలర్లు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సాధించిన విజయం ఒక కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. వన్డే చరిత్రలో మహిళల జట్టు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. భారత్ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) ప్రదర్శన ముందు టీమిండియా నిలవలేకపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగినల భారత్ 330 పరుగులకే ఆలౌట్ (48.5 ఓవర్లలో ) అయింది. స్మృతి మంధాన (80), ప్రతికా రావల్ (75) అద్భుత అర్ధసెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా 49 ఓవర్లలో మరో మూడు వికెట్లు ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ (142 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది.ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఓటమి అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో తాము ఇంకా మెరుగ్గా రాణించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Mithali Raj: మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం
“ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ అద్భుతంగా సాగింది, కానీ ఆఖర్లో మా రిథమ్‌ను కోల్పోయాము. చివరి 6-7 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల మేం అనుకున్న లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తక్కువయ్యాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, మేం సరిగా వినియోగించుకోలేకపోయాం. అయితే, ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, తదుపరి మ్యాచ్‌లపై దృష్టి పెడతాము” అని కౌర్ వ్యాఖ్యానించింది. ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే, భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లలో తప్పనిసరిగా విజయాలు సాధించాల్సి ఉంది.