Fuel Crisis: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడుతుందనే వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, ప్రజలు ఎవరూ కంగారు పడి బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో రాబోయే రెండు నెలలకు సరిపడా భారీ ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, సముద్ర మార్గాల్లో రవాణా ఆగిపోతుందనే ప్రచారంతో చాలా చోట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, భారత ఆయిల్ కంపెనీలు ముందుగానే అప్రమత్తమై దిగుమతులను ఖరారు చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి 40కి పైగా దేశాల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోందని, కాబట్టి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదని స్పష్టం చేసింది. దేశంలోని రిఫైనరీలు కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని వివరించింది.
సాధారణ నిల్వలతో పాటు, అత్యవసర పరిస్థితుల కోసం భూగర్భ గుహల్లో దాచిన ‘వ్యూహాత్మక నిల్వలు’ కూడా మనకు అండగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. గ్యాస్ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేవని, వివిధ దేశాల నుండి దిగుమతులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు సంయమనం పాటించాలని, ఇంధన సరఫరా యథావిధిగా జరుగుతుందని ప్రభుత్వం మరోసారి నొక్కి చెప్పింది.
