India-China Flights: భారతదేశం మరియు చైనా మధ్య వచ్చే నెల ప్రారంభంలోనే ప్రత్యక్ష విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అవ్వొచ్చని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘోర ఘర్షణతో భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సంఘటనలో ఇరుదేశాల సైనికులు ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుండి వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద భారీ సైనిక మోహరింపులు జరిగాయి. ఎన్నో రౌండ్ల సైనిక, దౌత్య చర్చలు జరిగినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
ఈ ఉద్రిక్తతలతో చైనా పెట్టుబడులపై భారత్ ఆంక్షలు విధించింది, దిగుమతులపై కఠిన నియంత్రణలు పెట్టింది. మహమ్మారి సమయంలో ప్రత్యక్ష విమానాలు కూడా నిలిపివేయబడ్డాయి. ఫలితంగా ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఇది కూడా చదవాడి: Hyderabad: తెలంగాణలో పొంగుతున్న చెరువులు..
అయితే, ఇటీవల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు కొనసాగుతుండటంతో చిన్న స్థాయిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో, భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలకు చైనాకు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండమని సూచించింది.
మరియు, ఈ నెల చివర్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోని టియాంజిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇది 2019 తర్వాత ఆయనకు మొదటి చైనా పర్యటన. చైనా కూడా ఈ పర్యటనను స్వాగతిస్తూ, ఇది “స్నేహం, సహకారానికి” దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రత్యక్ష విమానాల పునరుద్ధరణ వల్ల రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, ప్రపంచ వాణిజ్యంలో అమెరికాకు పోటీ ఇవ్వగల స్థితికి భారత్-చైనా చేరవచ్చని భావిస్తున్నారు.