Narendra Modi: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. “ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన స్కీమ్”ను ఎర్రకోట వేదికగాప్రకటించారు. దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం, ముఖ్యంగా యువతకు ప్రోత్సాహాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా మోదీ వెల్లడించారు. రూ. లక్ష కోట్ల రూపాయల పథకం వెంటనే అమల్లోకి వస్తుందని మోదీ అన్నారు. ఈ పథకం 3.5 కోట్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతతో పాటు, ఉద్యోగులను కలిపించే కంపెనీలకు కూడా ఈ పథకం కింద ప్రోత్సాహకాలు ఇస్తామని మోదీ తన ప్రసంగంలో వెల్లడించారు.
ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతకు ప్రభుత్వం నుండి నేరుగా నగదు ప్రోత్సాహం లభిస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులకు, వారి ఒక నెల వేతనానికి సమానమైన ప్రోత్సాహక మొత్తం లభిస్తుంది. ఈ మొత్తం గరిష్టంగారూ.15,000 వరకు ఉంటుంది. ఈ రూ.15,000 రెండు విడతల్లో లబ్ధిదారులకు అందుతుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
మొదటి విడత ఆరు నెలల ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత, రెండవ విడత పన్నెండు నెలల ఉద్యోగం పూర్తయిన తర్వాత అందుతుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే, ఉద్యోగి EPFO (Employees’ Provident Fund Organisation)లో నమోదై ఉండాలి. 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 మధ్య కొత్తగా ఉద్యోగంలో చేరి ఉండాలి.
ఉద్యోగాలను సృష్టించే కంపెనీలకు కూడా ఈ పథకం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయి. నెలకు రూ. 1 లక్ష లోపు జీతం ఉన్న ప్రతి కొత్త ఉద్యోగికి, యజమాని రూ. 3,000 వరకు ప్రోత్సాహకాన్ని పొందుతారు. ఈ ప్రోత్సాహకం రెండేళ్ల పాటు లభిస్తుంది. అయితే, తయారీ రంగంలోని కంపెనీలకు ఇది గరిష్టంగా నాలుగేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. కంపెనీలు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి (ఉదాహరణకు, 50 మంది ఉద్యోగుల కంటే తక్కువ ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 కంటే ఎక్కువ ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని నియమించుకోవాలి). ఈ పథకం ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చింది. దీని బడ్జెట్ దాదాపు రూ. 99,446 కోట్లు ఉంటుందని అంచనా.