టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్–కివీస్ తొలి టెస్టు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరుజట్ల మధ్య 3 మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 16వ తేదీ బుధవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్– న్యూజిలాండ్ తొలి టెస్టు జరగనుంది. అయితే, బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మ్యాచ్ జరిగే ఐదు రోజులూ బెంగళూరులో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. మ్యాచ్ జరిగే మొదటి రెండు రోజులు 70-90శాతం వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మూడోరోజు శుక్రవారం 67 శాతం, శనివారం 25 శాతం, ఆదివారం 40 శాతం జల్లులు కురవడానికి అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అయితే, చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు అత్యాధునిక పద్ధతులున్నాయి. ఇక్కడ అత్యాధునికమైన ‘సబ్‌ఎయిర్’ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఏది ఏమైనా.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో మొదటి రెండ్రోజుల ఆట వర్షార్పణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.