కాన్పూర్ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లాపై రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), గిల్ (6) విఫలమయ్యారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(51; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 120 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లా ఆటగాళ్లలో షాద్మాన్ ఇస్లాం (50) అర్థశతకంతో రాణించాడు. ఇక మిగిలిన ఎనిమిది టెస్టుల్లో మూడింట గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరనుంది టీమ్‌ఇండియా.

