Crime News: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో దారుణాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలో మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడారు.. పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు ఉండటంతో పాటు ఏరులై పారుతున్న కల్తీ కల్లు కావచ్చు..లేక గంజాయి సరఫరా కావచ్చు..ఎంతోమంది బలైపోతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేరాలు కలవరపెడుతున్నాయి.. హత్యలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి..పోలీస్ స్టేషన్‌లో ఎక్కువగా నేరాల కేసులే నమోదు అవుతున్నాయి. దీనికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటననే ఓ ఉదాహరణ.. మద్యం మత్తులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read: Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారిన నేవీ అధికారి హత్య
30 ఏళ్ల లోపు ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో కొందరు గంజాయికి అలవాటు పడ్డారని తెలుస్తోంది. దీనికితోడు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది.గంజాయికి యువత అడిక్ట్ అవుతున్నారు.
మరోవైపు బెల్ట్ షాపులు 24 గంటలు పనిచేస్తున్నాయి. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. గుడుంబా, కల్తీ కల్లు విక్రయాలపై చర్యలు చేపడుతున్నా..ఏదో ఒక చోట ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వీటిని పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బెల్ట్ షాపులకు మూసివేసి గంజాయి బ్యాచ్ భరతం పట్టాలని పోలీసులను కోరుతున్నారు.. మత్తు పానీయాలు, మాదకద్రవ్యాలు నియంత్రిస్తే జిల్లాలో నేరాలు తగ్గుతాయని ప్రజలు అంటున్నారు.
