Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఒక ఆర్మీ జవాన్ తన భూమిని కబ్జా చేసారని ఆరోపిస్తూ చేసిన వీడియో ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లెకు చెందిన రామస్వామి అనే జవాన్ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉండగానే తన గ్రామంలో ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించారని వేదనతో తెలిపారు.
ఈ వివాదంపై సైనికుడు రామస్వామి సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన కుటుంబం శాంతిగా జీవించాలనుకుంటే, వారి భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా బెదిరింపులకు గురి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులపై కూడా కబ్జాదారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
రామస్వామి అన్న కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఒక ఎకరం భూమిని చుక్కా రమేష్ అనే వ్యక్తి అక్రమంగా తన అన్నదమ్ముల పేరుపై మార్పు చేయించుకున్నారని తెలిపారు. అయితే, ఈ కేసులో కబ్జాదారుడి సోదరుడు వీఆర్వోగా(VRO) ఉండటంతో స్థానిక అధికారులు నిజాన్ని పట్టించుకోకుండా, కబ్జాదారులకు మద్దతు ఇస్తున్నారని వారు మండిపడ్డారు.
Also Read: CM REVANTH REDDY: మహిళలే దేశాన్ని గెలిపించిన శక్తి
Siddipet: ఈ విషయం స్థానికంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారడంతో, మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. కలెక్టర్‌ను సంప్రదించి తగిన విచారణ జరిపి జవాన్ భూమి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించినట్టు సమాచారం.
భారత సైన్యంలో సేవలందిస్తున్న వ్యక్తి తన స్వగ్రామంలో తన హక్కుల కోసం ఇలా కొట్టుకోవాల్సి రావడం ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది. “దేశాన్ని రక్షించే మన సైనికులకు కనీసం వారి స్వగృహంలో న్యాయం దక్కాలనే ఇది సమాజం దృష్టికి తీసుకురావాలి,” అని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, కలెక్టర్, జిల్లా అధికారులు దీనిపై స్పందించాలని ప్రజలు, సైనికుడి కుటుంబం కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది.