Nellore

Nellore: నెల్లూరులో దారుణం: యూనిఫామ్ లేదని విద్యార్థినులతో గుంజీలు.. 60 మందికిపైగా అస్వస్థత

Nellore: పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఓ క్రీడా ఉపాధ్యాయుడు (పీఈటీ) చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలోని కోట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పూర్తి యూనిఫాంలో రాలేదన్న కారణంతో పీఈటీ ఉపాధ్యాయుడు సుబాన్ ఈ విద్యార్థినుల చేత గుంజీలు తీయించాడు. గుంజీలు తీసిన తర్వాత విద్యార్థినుల కాళ్లు తీవ్రంగా వాచిపోయాయి. నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడటంతో వారంతా నొప్పితో విలపించారు. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు.

ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లల పట్ల క్రీడా ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read: Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!

సమాచారం అందుకున్న డీఎస్పీ గీతా కుమారి, ఇతర పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. ఈ ఘటనకు గల కారణాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. అలాగే, తల్లిదండ్రులు అధికారికంగా ఫిర్యాదు చేస్తే, బాధ్యులైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటన ఉపాధ్యాయుల శిక్షా పద్ధతులపై మరోసారి చర్చకు దారితీసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *