Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలం, అచ్చంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఎరువుల వ్యాపారి ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాల కారణంగా గతనెల 30న తండ్రి వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలతో కుమార్తెలు మోక్షిత(8), రఘవర్షిణి(6), కుమారుడు శివధర్మ(4) ద్విచక్రవాహనంపై బయటకు వెళ్ళాడు. తరువాత ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఎర్రగొండపాలెం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Bhupalpally: ప్రియుడి కోసం భర్త, కూతుర్ని చంపి క్షుద్రపూజల సీన్ క్రియేట్ చేసిన తల్లి
కాగా,అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఉన్న ఒక హోటల్‌లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా, అతను తన ఇద్దరు పిల్లలను అక్కడే వదిలి, పెద్ద కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెల్డండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు విగతజీవిగా పడి ఉండటాన్ని రైతులు గమనించారు. అక్కడ ఒక ద్విచక్రవాహనం, పురుగు మందు డబ్బా ఉండటాన్ని గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటం వల్ల, పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, తనతో పాటు తీసుకువెళ్లిన ఇద్దరు కుమార్తెలు, కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్వర్లు వారిని ఏదైనా చేసి ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా వారిని వదిలిపెట్టి ఈ పని చేశాడా అనేది ఇంకా అంతుచిక్కడం లేదు. మృతుడి తమ్ముడు మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.