Nacharam

Nacharam: నాచారంలో దారుణం: బంగారం కోసం ఇంటి యజమానురాలి హత్య..

Nacharam: హైదరాబాద్ నాచారం ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక హత్య కేసు ఇప్పుడు నగరాన్ని కలచివేస్తోంది. బంగారు నగల కోసం ఓ వృద్ధ మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని గోదావరిలో పడేసిన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో నివసించే సుజాత (65) అనే మహిళ ఇంట్లో కోనసీమ జిల్లాకు చెందిన ఎం. అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను గమనించిన అంజిబాబు, ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల 19న అదును చూసి ఆమెను హతమార్చి, తన స్నేహితులైన యువరాజ్, దుర్గారావుల సహాయంతో మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి కారులో ఆంధ్రప్రదేశ్‌కు తరలించాడు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు కోనసీమ జిల్లా కృష్ణలంక సమీపంలో మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశాడు.

Also Read: Actress Nandini: సీరియల్ నటి నందిని ఆత్మహత్య

డిసెంబర్ 24వ తేదీన సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చి చూడగా, ఇల్లు తాళం వేసి ఉండటంతో పాటు ఆమె ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులకు ఇంట్లో అద్దెకు ఉండే అంజిబాబు కదలికలపై అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మొదట తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. కేవలం నగలు దొంగలించేందుకే సుజాతను చంపినట్లు, తన ఇద్దరు స్నేహితులు ఈ నేరంలో సహకరించినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి, గోదావరి నదిలో సుజాత మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *