Konaseema: కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పావులూరి కామరాజు (35) అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులను చంపి, ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… కామరాజుతో పాటు అతని కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (7) విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, కామరాజు తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు కలిపి తాగించి హత్య చేసి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పావులూరి కామరాజు గతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేశారు. అయితే, ఐదేళ్ల క్రితం (2020లో) ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి కామరాజు తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. కుటుంబ సమస్యలు, మానసిక వేదనతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Guntur: గుంటూరు రైలులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం..
ముగ్గురిపై వేధింపుల ఆరోపణలు:
కాగా, కామరాజు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో… తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా శ్రీనివాస్, దుర్గారావు అనే వ్యక్తుల వల్లే తాను చనిపోతున్నట్లుగా ఆ వీడియోలో చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎస్సై నరేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో చిలకలపాడు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.