Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది వ్యక్తులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు కారణంగా పోలీస్ స్టేషన్ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాల భాగాలు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరి పడటం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.
పేలుడుకు కారణం ఏమై ఉండొచ్చు?
నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఈ భారీ విస్ఫోటం జరగడానికి ప్రధాన కారణం, ఇటీవల ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న 360 కిలోల పేలుడు పదార్థాలను పరిశీలించడమే అని తెలుస్తోంది. ఇటీవల హరియాణా, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఫరీదాబాద్‌లోని ఒక ఇంట్లో ఈ భారీ పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: Nadda: బీహార్‌లో ఎన్డీఏ సునామి – ప్రజల ప్రేమకు ధన్యవాదాలు
నమూనాలు సేకరిస్తుండగా ఘటన: అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి 11:22 గంటల సమయంలో, ఈ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ (నమూనాలు) తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఈ విస్ఫోటం జరిగింది. ఇందులో ఎక్కువగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోలీసు వర్గాలు మాత్రం, మేజిస్ట్రేట్ సమక్షంలో పేలుడు పదార్థాలను సీలింగ్ (ప్యాక్ చేసి భద్రపరిచే) చేస్తుండగా అమ్మోనియం నైట్రేట్ మండి పేలుడు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
పేలుడు సంభవించిన వెంటనే ఒక్కసారిగా భారీ మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం కలిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ శ్రీనగర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు.
భద్రతా దళాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇందులో ఏదైనా ఉగ్రవాద ఘటన చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

