Guntur

Guntur: గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు

Guntur:  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామంలో ఒక మహిళ చేసిన దారుణానికి పది మంది అమాయకులు మంటల్లో చిక్కుకుని ఆసుపత్రి పాలయ్యారు. వివాహేతర సంబంధం చివరకు ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, సుద్ధపల్లికి చెందిన ఆలంకుంట మల్లేష్‌కు, తెనాలిలోని సీఎం కాలనీకి చెందిన దుర్గ అనే మహిళకు మధ్య కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉండేది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు వస్తున్నాయి. శనివారం తెనాలిలో ఈ గొడవకు సంబంధించి పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. కానీ, తనను పంచాయితీకి లాగడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గ, ఎలాగైనా మల్లేష్ కుటుంబాన్ని అంతమొందించాలని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది.

Also Read: Khammam: పాఠాలు మానేసి రీల్స్ పిచ్చి.. ఇంగ్లీష్ టీచర్ పై సస్పెన్షన్ వేటు!

అనుకున్నదే తడవుగా, శనివారం రాత్రి సుద్ధపల్లిలోని మల్లేష్ ఇంటికి దుర్గ చేరుకుంది. ఆ సమయంలో మల్లేష్ ఇంట్లో లేకపోవడంతో, లోపల ఉన్న అతని భార్య అర్చన, తల్లి పద్మ, కుమారుడు అరుణ్‌లపై కసితో పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంటితో పాటు లోపల ఉన్న వారందరికీ నిప్పంటుకుంది. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన బాధితులు కేకలు వేయడంతో, స్థానికులు వారిని రక్షించేందుకు పరుగున వచ్చారు. అయితే, పెట్రోల్ కారణంగా మంటలు ఉధృతంగా ఉండటంతో, వారిని కాపాడబోయిన ఆరుగురు గ్రామస్థులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘర్షణలో దుర్గపై కూడా పెట్రోల్ పడటంతో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి.

మొత్తంగా ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సుద్ధపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నేరం చేసిన దుర్గను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నపాటి గొడవ చివరకు ఒక గ్రామాన్నే భయబ్రాంతులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *