Ghaziabad

Ghaziabad: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Ghaziabad:  ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో పెరిగి, ఒకే ఊపిరిగా మెలిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆన్‌లైన్ గేమ్ మాయలో పడి ప్రాణాలు వదిలారు. 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పాఖి.. ఈ ముగ్గురు మైనర్ బాలికలు ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలై, తొమ్మిదో అంతస్తు నుంచి దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

కరోనా సమయంలో చదువుల కోసం మొదలైన మొబైల్ ఫోన్ వాడకం, కాలక్రమేణా ఆ ముగ్గురిని ఆన్‌లైన్ గేమ్స్ వైపు మళ్లించింది. ముఖ్యంగా కొరియన్ ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత గేమ్‌లకు వీరు పూర్తిగా బానిసలయ్యారు. తినడం, నిద్రించడం, స్కూలుకు వెళ్లడం వంటి ప్రతి పనిని ఒక టాస్క్‌లాగా భావించి ముగ్గురూ కలిసే చేసేవారు. ఈ క్రమంలోనే గేమ్స్‌కు అలవాటు పడి చదువును, నిద్రను కూడా విస్మరించారు. చివరకు ఆ గేమ్‌లో భాగంగానే ఈ ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పిల్లలు నిత్యం ఫోన్లకే అతుక్కుపోవడం, స్కూలుకు కూడా సరిగ్గా వెళ్లకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారిని తీవ్రంగా మందలించారు. ఫోన్ వాడకం తగ్గించాలని హెచ్చరించారు. అయితే ఆన్‌లైన్ ప్రపంచంలోనే బతుకుతున్న ఆ బాలికలు తల్లిదండ్రుల మాటలకు మనస్థాపం చెందారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో, అందరూ నిద్రిస్తున్న వేళ నిచ్చెన సహాయంతో భవనం పైకి వెళ్లి ముగ్గురూ ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఘటన స్థలంలో పోలీసులకు “మమ్మీ.. డాడీ మమ్మల్ని క్షమించండి” అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది.

Also Read:  MLC Nagababu: తిరుమల కొండపై వైసీపీ దోపిడీ సాగింది.. ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తన ముగ్గురు మహారాణులు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి తండ్రి చేతన్ కుమార్ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. “నా పిల్లలు లూడో ఆడుకుంటున్నారని అనుకున్నాను.. అది డెత్ గేమ్ అని నాకు తెలియదు” అంటూ ఆయన వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

డిజిటల్ యుగంలో పిల్లలు వర్చువల్ ప్రపంచానికి బానిసలుగా మారి, వాస్తవ జీవితాన్ని కోల్పోతున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచి, పిల్లలను నియంత్రణ కోల్పోయేలా చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించి, వారిని ప్రేమతో కౌన్సెలింగ్ చేయాలని, సాంకేతికతకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని ఈ విషాద ఘటన హెచ్చరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *