Chandanagar: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో నివసించే తొమ్మిదేళ్ల బాలుడు ప్రశాంత్, తన స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తో బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి, మంగళవారం సాయంత్రం బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూడగా, అప్పటికే బాలుడు విగతజీవిగా నేలపై పడి ఉన్నాడు.
Also Read: Droupadi Murmu: నేటి నుంచి హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది!
ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడుకోవాల్సిన వయసులో, నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న బాలుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చిన్నారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌నే ఉరితాడుగా మార్చుకుని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
ఈ చిన్నారి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

