AP News: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంతో స్వయానా బావమరిది తన బావను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం బాపట్ల జిల్లా వేమూరు మండలంలో జరిగింది.
ప్రేమ వివాహంపై కక్ష:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడికి చెందిన కుర్రా నాగ గణేష్ (25), గుంటూరులోని బుడంపాడులో నివాసం ఉంటున్నాడు. ఇతను తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవితో పెళ్లి చూపుల సందర్భంగా పరిచయమయ్యాడు. గణేష్ పొట్టిగా ఉన్నాడనే కారణంతో యువతి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె సోదరుడు దుర్గారావు, ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయితే, గణేష్, కీర్తి తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు.
తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయి, సెప్టెంబర్ 25న అమరావతి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బుడంపాడులో కాపురం పెట్టారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
బావమరిది పక్కా ప్రణాళికతో హత్య:
తనకు ఇష్టం లేని వ్యక్తిని, పైగా పొట్టిగా ఉన్న గణేష్‌ను తన చెల్లి వివాహం చేసుకోవడంతో దుర్గారావు తీవ్ర కోపంతో రగిలిపోయాడు. తన చెల్లిని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహంతో రగిలిన దుర్గారావు, గణేష్‌ను ఎలాగైనా చంపాలని పక్కా ప్రణాళికతో కక్ష కట్టాడు.
ఇంతలో, తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని గణేష్ నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు కూడా. గణేష్ బ్యాంక్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, దుర్గారావు తన స్నేహితుల సహాయంతో అతన్ని అడ్డుకున్నాడు. నడిరోడ్డుపై కత్తితో దారుణంగా పొడిచి గణేష్‌ను హత్య చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గారావును విచారించగా, తన బావ పొట్టిగా ఉన్నందుకే, తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే ఈ హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. పెళ్లైన కొద్ది రోజులకే జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.