H-1B Visa: అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ప్రభావం.. హెచ్ -1బీ వీసాలపై కూడా పడనుంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టనుండటం, కార్యాలయాలు మూతపడటం వల్ల వీసాల ప్రాసెసింగ్ ను కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునర వెల్లడించారు. షట్ డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకుసాగదన్నారు. హెచ్ 1బీ కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండీషన్ అప్లికేషన్ ను కార్మికశాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Modi: ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
ఒకసారి అక్కడినుంచి ధ్రువీకరణ లభించగానే.. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు-USCISవద్ద సదరు కంపెనీ హెచ్ -1బీ పిటిషన్ దాఖలు చేస్తుంది. USCISను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు, దీనిపై షట్ డౌన్ ప్రభావం ఉండదు. కానీ కార్మికశాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. ఫలితంగా అక్కడినుంచి ధ్రువీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త హెచ్ -1బీల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్ లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.