Parenting Tips

Parenting Tips: పిల్లల ముందు గొడవపడుతున్నారా? అయితే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తున్నట్టే!

Parenting Tips: పిల్లలు ప్రతి విషయాన్ని చిన్నతనంలోనే నేర్చుకుంటారు.. అది మంచైనా, చెడైనా. ఇది తెలిసి కూడా తల్లిదండ్రులు పిల్లల పక్కనే గొడవ పడటం, తిట్టుకోవడం, కొన్నిసార్లు కొట్టుకోవడం చేస్తుంటారు. ఆ సమయంలో పిల్లలు వీళ్లని చూసి ఏడుస్తారు, భయపడతారు.. కానీ తల్లిదండ్రులు అవి పట్టించుకోరు. మళ్ళీ పైనుండి పిల్లల్నే తిడతారు. ఇలాంటి సంఘటనల వల్ల పిల్లల మనసులో ఎలాంటి గాయాలవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న పిల్లలు ప్రతి విషయానికి తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. వారికి తల్లిదండ్రులు పక్కనుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. అలాంటి వారే పిల్లల కళ్లముందే గొడవ పడితే.. ఆ ధైర్యం కాస్తా భయంగా మారుతుంది. అది మనసులో బలంగా గుర్తుండిపోతుంది. దీనివల్ల ప్రతి విషయానికి భయపడటం అలవాటుగా మారిపోతుంది, లేదా వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

తల్లిదండ్రులు గొడవపడుతుంటే తమ వల్లే గొడవపడుతున్నారేమో అని పిల్లలు అనుకుంటారు. అందుకే గొడవ జరిగిన తర్వాత పిల్లలు ఒక మూలన బాధగా కూర్చుంటారు తప్ప ఆడుకోరు. అలా ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారీ మనసులో కుమిలిపోతారు. కొన్నిసార్లు అందుకే తల్లిదండ్రులు కూడా దూరంగా ఉంటారు.

పిల్లలు చూసిందే చేస్తారు, నేర్చుకుంటారు. ఇంట్లో జరిగే గొడవలే ప్రపంచంతో వారు ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తాయి. విభేదాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కావాలనుకున్నప్పుడు అరిచి లేదా కోపంగా మాట్లాడటం చూసి, పిల్లలు కూడా అదే సరైన మార్గం అనుకుంటారు. అందుకే స్నేహితులతో లేదా వేరే వ్యక్తులతో కూడా అలాగే ప్రవర్తిస్తారు. విభేదాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అనే ఆలోచన వారికి కలగదు.

ఇంట్లో ఇలాంటి సంఘటనలు చూసి చూసి పిల్లలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోతారు. ఏదో కోల్పోయినట్టు ఉంటారు. చదవాలని ఉన్నా ఏకాగ్రత కుదరదు, చదువులో వెనకపడిపోతారు. వీరికి తరచుగా తలనొప్పి రావడం, కడుపులో సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతాయి. నిద్ర సమస్యలు కూడా వస్తుంటాయి. ఇది మనసుపైనే కాకుండా శరీరం పైన కూడా ప్రభావం చూపుతుంది.

ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉండే అనుబంధం బలహీనపడుతుంది. అప్పుడు పిల్లలు ఏదైనా విషయం లేదా తమకున్న సమస్యలు, భయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి వంద సార్లు ఆలోచిస్తారు. గొడవలు ఉంటే పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలి లేదా ప్రశాంతంగా సరిచేసుకోవాలి. అంతేగానీ పిల్లల ముందు గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడుకోకూడదు. పిల్లల ముందు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవాన్ని చూపించుకోవాలి. మనం ఎంత డబ్బు ఇచ్చామన్నది ముఖ్యం కాదు.. పిల్లలు పెరగడానికి ప్రశాంతమైన, ప్రేమతో కూడిన వాతావరణం ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *