Immigration and Foreigners Act 2025: భారత్‌లో అక్రమ వలసలు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, వీసాల ముసుగులో దేశంలో నివసిస్తున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025’ పేరుతో రూపొందించిన కొత్త చట్టం సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది.
బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టం ఆమోదం పొందగా, ఏప్రిల్ 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ దీనిని అధికారికంగా ప్రకటించారు.
నకిలీ పాస్‌పోర్ట్, వీసాలకు భారీ శిక్షలు
ఈ చట్టం ప్రకారం, నకిలీ పాస్‌పోర్ట్ లేదా వీసాతో భారతదేశంలోకి ప్రవేశించే, ఉండే లేదా బయటకు వెళ్లే వారికి:
కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష వేయనున్నారు. దింతో పాటు ₹1 లక్ష నుంచి ₹10 లక్షల వరకు జరిమానా విధించబడనుంది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించిన విదేశీయులకు 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹5 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చని చట్టం స్పష్టం చేసింది.
హోటళ్లు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులకు కఠిన నిబంధనలు
ఈ చట్టం ప్రకారం:
-
హోటళ్లు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు తమ వద్ద ఉన్న విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేయాలి.
-
ఈ నిబంధనలు పాటించని సంస్థలపై రిజిస్ట్రేషన్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు.
అలాగే, అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు, నౌకాయాన సంస్థలు తమ ప్రయాణీకులు, సిబ్బంది పూర్తి వివరాలను ముందుగానే సమర్పించాలి.
ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు మరిన్ని అధికారం
ఇమ్మిగ్రేషన్ బ్యూరోను బలోపేతం చేస్తూ, అక్రమ విదేశీయులను వెంటనే బహిష్కరించే అధికారం ఇవ్వబడింది. రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సమన్వయం చేసుకునే విధంగా వ్యవస్థను సవరించారు.
పాత చట్టాలకు గుడ్‌బై
ఇప్పటి వరకు వలసల నియంత్రణకు వేర్వేరు నాలుగు చట్టాలు అమలులో ఉన్నాయి:
-
పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం, 1920
-
విదేశీయుల నమోదు చట్టం, 1939
-
విదేశీయుల చట్టం, 1946
-
వలస (వాహకాల బాధ్యత) చట్టం, 2000
ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 అనే ఒకే చట్టం కిందకి అన్ని నిబంధనలు తెచ్చారు.
జాతీయ భద్రతకు బలమైన అడుగు
ఈ కొత్త చట్టం ద్వారా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు, దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తామని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.