IBomma Ravi

IBomma Ravi: పైరసీకి చెక్.. ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్! పట్టిచ్చింది భార్యేనా?

IBomma Ravi: సినిమా నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సినిమా పైరసీ చేస్తూ కోట్లాది రూపాయల నష్టం చేకూర్చిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని విచారించగా కొన్ని ముఖ్య విషయాలు బయటపడ్డాయి.

రవి ప్లాన్.. భార్య రివర్స్ స్ట్రోక్!
రవి స్వస్థలం వైజాగ్ అయినా, హైదరాబాద్ కూకట్‌పల్లిలో అతనికి ఓ అపార్ట్‌మెంట్ ఉంది. కాగా, రవికి, అతని భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయట. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా అనుకున్నారట. ఈ క్రమంలో, విదేశాల్లో ఉంటున్న రవి తన భార్యకు విడాకులు ఇవ్వడం కోసమే శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కూకట్‌పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్‌లో ఉన్నప్పుడు పోలీసులు మెరుపు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు.

అరెస్టు వెనుక అసలు కారణం ఇదే!
రవి హైదరాబాద్ వస్తున్న విషయం పోలీసులకు ఎలా తెలిసిందంటే… సాక్షాత్తు అతని భార్యే ఈ సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసిందట! భర్తపై ఉన్న కోపంతో రవి కదలికల గురించి ఆమెనే పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు పక్కా ప్లాన్‌తో నిఘా ఉంచి రవిని అరెస్టు చేశారు. రవి నివాసం నుంచి పోలీసులు కీలకమైన హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కొన్ని కొత్త సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

సంతోషంలో సినీ నిర్మాతలు
చాలాకాలంగా కరీబియన్ దీవుల్లో ఉంటూ, సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను కూడా రవి పైరసీ చేస్తున్నాడు. దీంతో నష్టపోతున్న టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేయగా, ఇప్పుడు ముఖ్య సూత్రధారి అయిన ఐబొమ్మ రవిని కూడా అరెస్టు చేయడం పట్ల సినిమా రంగం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *