Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండాల్సిన ఎండలు ఈసారి మార్చి మొదటి వారంలోనే మొదలైపోయాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు సెగలు గక్కుతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఇప్పటికే కర్నూలు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దరిదాపుల్లోకి చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఎండలు మునుపటి కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, వేసవి కాలం “దబిడిదిబిడే” అన్నట్లుగా ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాబోయే మే నెలలో ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వర్షాలు, చలి కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి, ఇప్పుడు ఎండలు కూడా అదే బాటలో సాగుతున్నాయి.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో తిరగవద్దని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గొడుగు లేదా టోపీ ధరించాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పానీయాలు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యేలా ఉన్నాయి. కేవలం ఎండలే కాకుండా ఉక్కపోత కూడా జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాబట్టి ప్రజలు అజాగ్రత్తగా ఉండకుండా, ఎండల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
