Weather Report

Weather Report: తెలంగాణలో మండిపోనున్నఎండలు ..ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే..

Weather Report: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీహార్ నుంచి మరాఠ్వాడా వరకు విస్తరించి ఉన్న ఒక వాతావరణ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల వడగాల్పుల తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం, రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయి. అయితే, ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది. మార్చి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో మండిపోతుండటంతో, రాబోయే ఏప్రిల్, మే నెలల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. కోస్తా కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అయితే, ఏపీలో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ (IMD) వెల్లడించింది.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని, ఒకవేళ రావాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. మార్చిలోనే ఎండలు దంచికొడుతుండటంతో రాబోయే రోజుల్లో ఉక్కబోత కూడా పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *