Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ (అద్దె గర్భం) పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టైంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌బజార్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా బిడ్డను కనవచ్చని డాక్టర్ నమ్రత చెప్పడంతో రూ.30 లక్షలు చెల్లించారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనాలతో బిడ్డ డీఎన్‌ఏను పోల్చాలని దంపతులు షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా, తల్లిదండ్రుల డీఎన్‌ఏతో బిడ్డ డీఎన్‌ఏ సరిపోలలేదు. తాము మోసపోయామని గ్రహించిన దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read: Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 10కిపైగా కేసులు
పోలీసుల విచారణలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌కు ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థ అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సేకరించిన వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెజిమెంటల్‌బజార్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్ తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అనే మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కేంద్రాలలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా, సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్య కణాలను అక్రమంగా నిల్వ చేసినట్లు, సేకరించినట్లు గుర్తించారు. పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించి, పలు కీలక పత్రాలతో పాటు వీర్య కణాల శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ ఘటనతో సంతానం కోసం ఆశపడే దంపతుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.