ICC

ICC: బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల వేదిక మార్పుకు నిరాకరణ!

ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గట్టి షాక్ తగిలింది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా, తమ జట్టు మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ తన లీగ్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే ఆడాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ సముఖత చూపలేదు. ఈ మేరకు తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.

బంగ్లాదేశ్ విన్నపాన్ని పరిశీలించిన ఐసీసీ, వేదికల మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని, ఇది టోర్నీలో బంగ్లాదేశ్ అవకాశాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ‘ESPNcricinfo’ వెల్లడించింది. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనాలంటే నిబంధనల ప్రకారం కేటాయించిన వేదికల వద్దే ఆడాలని, లేనిపక్షంలో సాంకేతికంగా నష్టపోక తప్పదని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ నుంచి తమకు ఇంకా అధికారికంగా ఎలాంటి అల్టిమేటం అందలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బుకాయిస్తోంది.

Also Read: Shikhar Dhawan: రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్: ఫిబ్రవరిలో సోఫీ షైన్‌తో వివాహం!

ఈ వివాదం వెనుక ఐపీఎల్‌లో జరిగిన ఒక పరిణామం కూడా కీలకంగా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు వ్యక్తమవడంతో, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తమ స్టార్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్‌ను విడుదల చేసింది. దీనికి బీసీసీఐ సూచనలే కారణమని భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని గతంలోనే హెచ్చరించింది. ఆటగాళ్ల రక్షణ దృష్ట్యా భారత్ కాకుండా శ్రీలంకలో ఆడతామని భీష్మించుకు కూర్చుంది.

ప్రస్తుతానికి ఐసీసీ తన నిర్ణయాన్ని స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్ ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, పంతం వీడి భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడటం, లేదా టోర్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పాయింట్లు కోల్పోవడం. ఫిబ్రవరిలో జరగనున్న ఈ సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు క్రీడాలోకంలో ఆసక్తికరంగా మారింది. వేదిక మార్పు విషయంలో ఐసీసీ వెనక్కి తగ్గే సూచనలు లేకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో అడుగుపెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *