ICC: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళలు క్రీడలలో పాల్గొనడంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మద్దతు ప్రకటించింది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ల పాలన కారణంగా దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా పర్యవేక్షణలో చేపట్టిన ఈ చొరవలో భాగంగా, నిర్వాసిత అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు రాబోయే రెండు ప్రధాన గ్లోబల్ ఈవెంట్‌లలో కీలక ఎంగేజ్‌మెంట్ అవకాశాలు కల్పించబడతాయన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
ఈ చొరవ ఐసీసీ ఆధ్వర్యంలో BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి), ECB (ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు), CA (క్రికెట్ ఆస్ట్రేలియా) వంటి మూడు ఆర్థికంగా బలమైన క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు సాగుతోంది. గతంలో హరారేలో జరిగిన ఐసీసీ సమావేశంలోనే ఈ మూడు బోర్డులు అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు మద్దతు ఇవ్వడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కాగా 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, మహిళలు క్రీడలలో పాల్గొనడాన్ని నిషేధించారు. దీంతో చాలా మంది అఫ్గాన్ మహిళా క్రికెటర్లు తమ ప్రాణాల రక్షణ కోసం దేశం విడిచి పారిపోయారు, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక పూర్తి సభ్య దేశానికి పురుషుల జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే, వారికి మహిళల జట్టు కూడా ఉండాలి. తాలిబన్ల నిషేధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఈ నిబంధనను పాటించలేకపోతోంది.