Ibomma Ravi: ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసిన ఈ కేసులో, రవి తన భవిష్యత్ ప్రణాళికల గురించి పోలీసుల ముందు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా, ‘ఇక ఐబొమ్మ పని అయిపోయింది, నీ తర్వాతి ఆలోచన ఏంటి?’ అని పోలీసులు అడగగా… రవి ఇచ్చిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు.
విచారణలో షాకింగ్ నిజాలు: ఖర్చు రూ. 17 కోట్లు, చుట్టింది 86 దేశాలు
ఐబొమ్మ ద్వారా వచ్చిన డబ్బుతో రవి చాలా విలాసవంతమైన జీవితం గడిపినట్లు విచారణలో తేలింది. తను సంపాదించిన మొత్తంలో దాదాపు 17 కోట్ల రూపాయలను కేవలం తన ఎంజాయ్‌మెంట్ కోసమే ఖర్చు చేశానని రవి స్వయంగా చెప్పాడు. అంతేకాదు, ఆ పైరసీ డబ్బుతో 86 దేశాలను చుట్టివచ్చానని చెప్పి పోలీసులనే ఆశ్చర్యపరిచాడు. ఈ మాటలు వింటే, రవి ఎంత ఉల్లాసంగా, జల్సాగా గడిపాడో అర్థమవుతుంది. అతని ప్రధాన లక్ష్యం కూడా డబ్బు సంపాదించి, దానితో సంతోషంగా గడపడమేనని వెల్లడించాడు.
కరేబియన్‌లో ‘ఐబొమ్మ’ రెస్టారెంట్!
ఐబొమ్మ కథ ముగియడంతో రవి మరో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నాడు. కరేబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతోనే ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేశాడట. అక్కడ ఉండే వారికి భారతీయ వంటకాలను పరిచయం చేయాలని, ఆ దీవుల్లోని అన్ని దేశాల్లోనూ తన రెస్టారెంట్ శాఖలను (బ్రాంచ్‌లను) పెట్టాలని రవి కలలు కన్నాడు. ఇప్పటికే రవిని పోలీసులు రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా, పోలీసులు రవికి సంబంధించిన 3 కోట్ల రూపాయలతో పాటు ఆస్తులను కూడా సీజ్ చేశారు. ఏదేమైనా, ఒక పైరసీ సైట్ నిర్వాహకుడు అంతర్జాతీయ స్థాయిలో రెస్టారెంట్ పెట్టాలనుకోవడం… నిజంగా పెద్ద ప్లానింగే!

