iBomma Ravi: “దమ్ముంటే పట్టుకోమంటూ” సైబర్ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ (iBomma) పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి (Imandi Ravi) వ్యవహారం సంచలనంగా మారింది. విదేశాల్లో ఉంటూనే తన చుట్టూ ఎవరో తిరుగుతున్నారనే భయంతో ఆందోళన పడిన రవి… చివరకు తన అతివిశ్వాసం, పోలీసుల మెరుపు వ్యూహానికి బలై హైదరాబాద్‌లో చిక్కాడు. రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విచారణలో ఎన్నో కీలక ఆధారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను సేకరించారు.
సోమవారం నాటి కస్టడీ గడువు ముగియడంతో అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, అతనిపై నమోదైన మరో నాలుగు కేసుల్లో కూడా అరెస్ట్ చేసి, త్వరలోనే కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ విచారణలో వెలుగు చూసిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
పైరసీ డబ్బుతో ఆస్తులు.. భార్యతో విడాకులు వెనుక ఒప్పందం
రవి ఆర్ధిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితంలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. 2015లోనే కూకట్‌పల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో రవి సొంత ఇంటిని కొనుగోలు చేశాడు. తన ఐటీ కంపెనీ ఆదాయంతో మొదట వాయిదాలు చెల్లించినా, కేవలం రెండేళ్లలోనే బ్యాంకు రుణాన్ని పూర్తిగా తీర్చేశాడు. డబ్బు సంపాదించడం లేదంటూ తనను అవమానించిందనే కారణంతో భార్యను దూరం పెట్టాడు. తన కన్న కూతురు, కేవలం 8 నెలల పసికందు అని కూడా చూడకుండా కొట్టేవాడని విదేశాల్లో ఉన్న అతని మాజీ భార్య పోలీసులకు ఫోన్ ద్వారా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: World Cup: భారత్ ఖాతాలో మహిళల కబడ్డీ ప్రపంచకప్
రవి ప్రవర్తన నచ్చకే విడాకులు తీసుకున్నట్లు ఆమె చెప్పింది. అయితే, విడాకులకు అంగీకరించే ముందు… తాను సంపాదించిన ఆస్తిపాస్తులపై భార్యకు, కుమార్తెకు ఎలాంటి హక్కు లేకుండా అంగీకరిస్తూ రాతపూర్వక ఒప్పంద పత్రంపై సంతకం తీసుకున్నాకే రవి విడాకులకు అంగీకరించినట్లు సమాచారం.
దొరికిన తీరులో పోలీసుల తెలివితేటలు
రవిని పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు అనుసరించిన వ్యూహం అతని అతివిశ్వాసాన్ని ఎలా దెబ్బతీసిందో తెలుస్తోంది. పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసిన సర్వర్ల ఐపీ అడ్రస్ ఆధారంగా డొమైన్ల నోడల్ అధికారి ఫోన్ నంబర్‌ను పోలీసులు సేకరించారు. తాము వెతుకుతున్న మోసగాడే ఆ నోడల్ అధికారి అని మొదట్లో పోలీసులు గ్రహించలేదు. కానీ, విదేశీ దర్యాప్తు సంస్థల తరహాలో… ‘ఐబొమ్మ, బప్పం డొమైన్లలో పైరసీ సినిమాలున్నాయంటూ ఆధారాలు పంపాలంటూ’ ఆ నోడల్ అధికారి (రవి) పోలీసులకు మెయిల్ చేశాడు. తాను విదేశీ సంస్థల నుంచి సమాచారం రాబట్టగలననే అతివిశ్వాసంతో చేసిన ఈ పనే… రవి అసలు స్వరూపాన్ని, అతని పాత్రను పోలీసులకు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్
తన గురించి పోలీసులు ఆరా తీస్తున్నారని పసిగట్టిన రవి తీవ్ర భయానికి గురయ్యాడు. “నా కోసం నెదర్లాండ్స్‌కు వచ్చింది మీరేనా!” అని కస్టడీ విచారణలో ఐదో రోజు పోలీసులను అడగడం ఈ భయానికి నిదర్శనం. పోలీసుల నుంచి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో, అంతా సద్దుమణిగిందని ధీమాగా భావించి పోలాండ్, ఫ్రాన్స్‌లలో 20 రోజులు గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో… అతివిశ్వాసం, అలసత్వంతో తనను తాను పోలీసులకు చిక్కేలా చేసుకున్నాడు.
పాన్ కార్డు’పై స్నేహితుడి పేరుతో మస్కా
రవి తన లావాదేవీల గోప్యత కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పైరసీ డొమైన్ల చెల్లింపులకు తన వివరాలను గోప్యంగా ఉంచుతుందనే నమ్మకంతో పేపాల్ (PayPal) ద్వారా చెల్లింపులు జరిపాడు. వెల్లెల ప్రహ్లాద్‌కుమార్ (Vellela Prahlad Kumar) పేరుతో తీసుకున్న పాన్ కార్డుపై రవి తన ఫోటోనే ఉపయోగించాడు. దీనిపై ప్రశ్నించగా… 2007-08లో అమీర్‌పేట్‌లో ఉన్నప్పుడు తన మిత్రుడు ప్రహ్లాద్‌కుమార్ పేరుతో ఈ కార్డు తీసుకున్నట్టు తెలిపాడు. అయితే, అతని ఫోన్ నంబర్, చిరునామా అడిగినప్పుడు మాత్రం “తెలియదు” అంటూ దాటవేశాడు. ప్రస్తుతం, రవి స్నేహితులు, అతనికి సహకరించిన వారి గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతని లావాదేవీలన్నింటినీ గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ బృందం పనిచేస్తోంది.

