Ibomma Ravi: సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ కేసులో కీలక నిందితుడు, ప్రముఖ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించడానికి, రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని నాంపల్లి కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ పోలీసులు రవిని బషీర్‌బాగ్‌లోని సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం, అతడిని అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రవి నుంచి మరింత సమాచారాన్ని, ముఖ్యంగా అతని వెనుక ఉన్న వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించాలని చూస్తున్నారు.
వేల సినిమాల పైరసీ… అంతర్జాతీయ ఆపరేషన్
ఇమంది రవి గతంలోనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. దేశంలోని అన్ని భాషలకు చెందిన సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. రవి కేవలం భారత్‌లోనే కాకుండా, కరేబియన్ దీవులను కేంద్రంగా చేసుకొని గత ఆరేళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. రవి సుమారు 66 మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేసి, కోట్లాది మందికి అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.
డేటా అమ్మకాలు… సైబర్ నేరాలకు దారి
సినిమా పైరసీతో పాటు, ఇమంది రవిపై మరో కీలకమైన నేరం కూడా ఉంది. ఈ వెబ్‌సైట్‌ను చూసే 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను అతడు అక్రమంగా సేకరించాడు. ఈ విలువైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు, అలాగే బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులకు అమ్మి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. ఈ విధంగా పైరసీతో పాటు, డేటా చోరీ, అమ్మకం ద్వారా రవి అక్రమంగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో ఈ కేసులో ఇంకెంతమందికి సంబంధం ఉంది? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న ఆర్థిక మూలాలు ఏంటి? అనే విషయాలను పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది.

