iBomma Ravi: తెలుగు సినీ పరిశ్రమను వణికించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వెనుక ఉన్న అసలు రంగును పోలీసులు ఎట్టకేలకు బయటపెట్టారు. 12 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈ రిపోర్ట్‌లో పైరసీ సామ్రాజ్యం ఎలా విస్తరించింది, సినిమాల కొనుగోలు వెనుక ఉన్న చీకటి ఒప్పందాలు ఏమిటి అనే విషయాలపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రవి కేవలం ఒక వెబ్‌సైట్ నిర్వాహకుడిగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో హవాలా తరహాలో లావాదేవీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రింట్‌ను బట్టి రేటు.. డాలర్లలో చెల్లింపులు!
పోలీసుల కథనం ప్రకారం, రవి సినిమాలను రెండు పద్ధతుల్లో కొనుగోలు చేసేవాడు. థియేటర్లలో రికార్డ్ చేసిన క్యామ్ కార్డర్ (Camcorder) ప్రింట్‌కు ఒక ధర, హై క్వాలిటీ ఉండే హెచ్‌డీ (HD) ప్రింట్‌కు మరో ధర నిర్ణయించేవారు. ఒక్కో క్యామ్ కార్డర్ ప్రింట్ సినిమా కోసం 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్ కోసం 200 డాలర్లు వెచ్చించినట్లు రవి విచారణలో అంగీకరించాడు. ఈ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే జరగడం గమనార్హం. రవి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, ఇప్పటివరకు సుమారు రూ.13.40 కోట్ల మేర నిధులు చేరినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: New Year 2026: న్యూఇయర్ రోజు మందుబాబులకు గుడ్ న్యూస్.. ఫ్రీ రైడ్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి..
బెట్టింగ్ యాప్స్ లింకులు.. కుటుంబ సభ్యులకు మళ్లింపు
కేవలం పైరసీ మాత్రమే కాకుండా, ఐబొమ్మ వెబ్‌సైట్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి భారీగా ఆర్జించినట్లు తేలింది. ఈ ప్రమోషన్ల ద్వారా రూ.1.58 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ అక్రమ సంపాదనలో కొంత భాగాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు. తన సోదరి చంద్రిక ఖాతాకు రూ.90 లక్షల వరకు పంపించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మొదట్లో కూకట్‌పల్లి కేంద్రంగా సాదాసీదాగా కార్యకలాపాలు సాగించిన రవి, డబ్బులు వెల్లువెత్తడంతో జల్సాలకు అలవాటుపడి ఇతర దేశాలకు చెక్కేసినట్లు దర్యాప్తులో తేలింది.
కోర్టులోనే తేల్చుకుంటా:
రవి సవాల్ మరోవైపు పోలీసుల ఆరోపణలను రవి తీవ్రంగా ఖండించారు. మూడు కేసుల్లో భాగంగా 12 రోజుల విచారణ ముగించుకుని కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టిన కేసులన్నీ అవాస్తవాలని, పోలీసులు తప్పుడు కేసులు సృష్టించారని ఆరోపించారు. “ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను, సరైన సమయంలో అన్ని వాస్తవాలు నేనే బయటపెడతాను” అంటూ ధీమా వ్యక్తం చేశారు.
