Supreme Court: రెండు దశాబ్దాలుగా ఉత్కంఠ రేపుతున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) కొట్టివేసింది. గతంలో ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
సీబీఐ కీలక ఆరోపణలు
మైనింగ్ బారన్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి అక్రమంగా లీజులు కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని సీబీఐ (CBI) తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనులను సొంత పరిశ్రమ అవసరాలకు (Captive) మాత్రమే కేటాయించాలి. కానీ, శ్రీలక్ష్మి తన అధికార పరిధిని మించి ప్రభుత్వ ఉత్తర్వుల నుండి ‘క్యాప్టివ్’ అనే పదాన్ని తొలగించారని సీబీఐ వాదించింది.
శ్రీలక్ష్మి పదవిలో ఉన్న కాలంలోనే ఆమె మరిది పేరుతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, ఇవన్నీ మైనింగ్ కేటాయింపులకు ప్రతిఫలంగా వచ్చినవేనని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల నిందితులు ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం చేకూర్చారని సీబీఐ స్పష్టం చేసింది.
పొరపాటును సవరించిన సుప్రీంకోర్టు
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఈ కేసును వేరే కేసుగా భావించి పొరపాటున స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాత్కాలికంగా లభించిన ఆ స్టేను నిందితులు ఇన్నాళ్లూ అనుభవించారని (Enjoyed the stay), కానీ ఇకపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో శ్రీలక్ష్మిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ముమ్మరం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి జైలు శిక్షలు ఖరారైన నేపథ్యంలో, ప్రస్తుతం ఏపీలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీలక్ష్మికి ఈ తీర్పు ఒక పెద్ద గండంగా మారింది. ఆమె వెంటనే సీబీఐ కోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
