Tata Steel Chess 2025: హోరాహోరీగా జరుగుతున్న టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్ లో ఒక అనుహ్యమైన వివాదం చోటుచేసుకుంది. భారత గ్రాండ్ మాస్టర్ వైశాలితో మ్యాచ్ అనంతరం కరచాలనం చేసేందుకు ఉజ్బెకిస్తాన్ ప్లేయర్… యాకుబ్బోయెవ్ నిరాకరించడం ఎంతో వివాదాస్పదంగా మారింది. యుక్త వయసులో ఉండే గ్రాండ్ మాస్టర్లు అందరూ ఆడే ఈ టోర్నమెంట్ లో ఇటువంటి ఒక సంఘటన జరగడం ప్రపంచ చెస్ వర్గాల్లో సంచలనంగా మారింది..!
భారత మేటి గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెల్లెలు అయిన వైశాలి… టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్ నాలుగవ రౌండ్ మొదలుకాబోతున్న సమయంలో తన ప్రత్యర్థి అయిన ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ యాకుబ్బోయెవ్ తో ఆనవాయితీ పరంగా కరచాలనం చేసేందుకు తమ చేతిని ముందుకు చాపింది. అయితే ఆమెతో చేయి కలిపేందుకు యాకుబ్బోయెవ్ నిరాకరించడంతో ఒక్కసారిగా ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ కావడంతో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ వెంటనే ట్విట్టర్ ద్వారా తన వివరణ ఇచ్చుకున్నాడు. తనకు మహిళలు అన్నా… ఇండియన్ చెస్ ప్లేయర్లు అన్న ఎంతో గౌరవం ఉందని చెప్పిన యాకుబ్బోయెవ్… తను ఎవరినీ అగౌరవపరిచేందుకు ఆ పనిని చేయలేదని అన్నాడు. ఈ విషయంపై మరింత వివరణ ఇస్తూ ఈ యువ ఉబ్జెకిస్తాన్ ప్లేయర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Odisha Warriors: తొలి డబ్ల్యూహెచ్ఐఎల్ విజేతలుగా ఒడిశా వారియర్స్..!
తను కేవలం తన సొంత మతపద్ధతుల ద్వారానే వ్యవహరించినట్లు, ఒక ఇస్లాం మతస్థుడిగా తాను పరాయి స్త్రీలకు కరచాలనం చేయలేను అని వివరణ ఇచ్చుకున్నాడు. తను చేసిన పని వల్ల వైశాలి కనుక ఇబ్బందిపడి ఉంటే తాను తక్షణమే క్షమాపణలు చెబుతున్నట్లు కూడా యాకుబ్బోయెవ్ చెప్పాడు. ఇందుకు కొనసాగింపుగా… కేవలం తాను మాత్రమే అవతలి స్త్రీలతో కరచాలనం చేయలేనని… అలాగని తనలాగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండమని ఎవరికీ సలహా ఇవ్వట్లేదని కూడా తెలియజేశాడు..
అంతే కాకుండా… అతను స్త్రీలను హిజాబ్ లేదా బుర్కా ధరించాలని కూడా కోరుకోవట్లేదని… కేవలం తన మతాన్ని ఆచరిస్తూ అందులో అన్ని నియమాలను మాత్రమే పాటిస్తున్నట్లు చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఒక యువ చెస్ ప్లేయర్ ఈ విధంగా కనీసం షేక్ హ్యాండ్ చేసేందుకు నిరాకరించడం అనేది చాలా పెద్ద వివాదమే. మరి దీనిపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎలా వ్యవహరిస్తుంది అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. కొసమెరుపు ఏమిటంటే… ఈ మ్యాచ్ లో వైశాలి… యాకుబ్బోయెవ్ ను ఓడించిన తర్వాత మరలా కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపలేదు.