Prashant Kishor: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే), బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు మౌనం వీడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగి ఉంటాయని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆదివారం ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
క్షేత్రస్థాయి మద్దతుకు, పోలింగ్ సరళికి పొంతన లేదు
జన్ సురాజ్ పార్టీ తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసి, కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ భారీ పరాజయాన్ని అంగీకరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో తమ ప్రచారానికి మంచి స్పందన లభించిందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. తన పాదయాత్ర సమయంలో టీమ్ అందించిన ఫీడ్‌బ్యాక్‌కు, నమోదైన ఓటింగ్ సరళికి మధ్య పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు. “కొన్ని విషయాల్లో మాత్రం తేడా కనిపిస్తోంది. ఏదో అదృశ్య శక్తులు ఈ ఎన్నికల్లో పని చేశాయి. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పార్టీలకు కూడా లక్షల కొద్దీ ఓట్లు వచ్చాయి. ఏదో తప్పు జరిగిందని ప్రాథమికంగా అనిపిస్తోంది,” అని పీకే అభిప్రాయపడ్డారు.
Also Read: Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ఇవే..
ఈవీఎం రిగ్గింగ్ ఆరోపణలు, ఆధారాలు లేవు
ఎన్నికల ఫలితాలపై ఈవీఎమ్‌ల విషయంలో అవకతవకలు జరిగాయని కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అయితే, “ఓడిపోయిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం సహజం. ప్రస్తుతం నా వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు, కానీ కొన్ని విషయాలు మాత్రం సరిపోలడం లేదు” అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయని పీకే నమ్మకం వ్యక్తం చేశారు.
జన్ సురాజ్ ఓటమికి గల కారణాలలో ఎన్డీయే (NDA) డబ్బు పంపిణీ కూడా ఒకటని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఎన్నికల ప్రకటన నాటి నుంచి పోలింగ్ రోజు వరకూ దాదాపు 50 వేల మంది మహిళలకు రూ. 10 వేలు చొప్పున అందాయని ఆయన తెలిపారు. ఇది మొత్తం రూ. 2 లక్షలు ఇస్తామన్న హామీలో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అట. ఎన్డీయేకు, నితీశ్ కుమార్‌కు ఓటేస్తేనే మిగిలిన మొత్తం వస్తుందని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని ఆయన అన్నారు. ఇంత మంది మహిళలకు డబ్బు పంచడాన్ని తాను బిహార్‌తో సహా దేశంలో ఎక్కడా చూడలేదని పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, తమ పార్టీ గెలిచే స్థితిలో లేదని కొందరు ఓటర్లు అయోమయానికి గురై, లాలూ జంగిల్ రాజ్ సర్కార్ తిరిగి రాకూడదనే భయంతో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారని కూడా ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ 238 సీట్లలో పోటీ చేసి కేవలం 2 నుంచి 3 శాతం ఓట్లను మాత్రమే సాధించింది, ఎక్కువ మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

