Hyper Aadi: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల వారణాసిలో జరిగిన ఒక ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టిస్తున్నాయి. రాజమౌళి దేవుడిని ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపిస్తూ కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
రాజమౌళి వ్యాఖ్యలపై విమర్శలు
వారణాసి గ్లింప్స్ వీడియో ఆలస్యం కావడంపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ‘ఒక గ్లింప్స్ వీడియో ఆలస్యం అయితే ఏకంగా దేవుడినే తప్పు పడతాడా?’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు రాజమౌళి గానీ, వారణాసి ఈవెంట్ టీం గానీ అధికారికంగా స్పందించలేదు.
హైపర్ ఆది స్పందన – అవమానించలేదు, అలిగాడు!
తాజాగా, నటుడు ప్రియదర్శి హీరోగా వస్తున్న ‘ప్రేమంటే’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కమెడియన్ హైపర్ ఆది ఈ వివాదంపై స్పందించారు.
ఆది మాట్లాడుతూ, రాజమౌళి హనుమంతుడిని అవమానించలేదని స్పష్టం చేశారు. తన గ్లింప్స్ వీడియో లేట్ అయినందుకు ఆయన హనుమంతుడిపై అలిగాడు తప్ప, అది అవమానం కాదని పేర్కొన్నారు.
సెలబ్రిటీలపై ట్రోలింగ్ దారుణం
సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేయడం, విమర్శలు గుప్పించడం చాలా దారుణమని హైపర్ ఆది మండిపడ్డాడు. కేవలం సినీ ప్రముఖులను ఏదో ఒక రకంగా ట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు.
ఆది మాటల్లో ట్రోలింగ్ ఉదాహరణలు:
రాజమౌళి ఏ పోస్టర్ విడుదల చేసినా దాన్ని ట్రోల్ చేయడం. అల్లు అర్జున్ నవ్వితే ట్రోల్ చేయడం. చిరంజీవిపై ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేయడం. రామ్ చరణ్‌పై కూడా నిరంతరం ట్రోల్స్ చేయడం. ఏ సెలబ్రిటీ ఏది చేసినా సరే, దాన్ని వక్రీకరించి ట్రోల్ చేయడం అలవాటుగా మారిందని, ఈ ధోరణిని ప్రజలు తగ్గించుకోవాలని హైపర్ ఆది సూచించారు.

