Hydraa

Hydraa: మియాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. రూ.3వేల కోట్ల విలువైన భూమి స్వాధీనం!

Hydraa: హైదరాబాద్ నగర శివార్లలో భూకబ్జాదారుల గుండెల్లో హైడ్రా మరోసారి వణుకు పుట్టించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్‌లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి అధికారులు కాపాడారు. మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబర్ 44లో సుమారు 43 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో కాజేయాలని చూశారు. ఈ భూమి మార్కెట్ విలువ దాదాపు 3 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 159 సర్వే నంబర్‌కు చెందిన పత్రాలను చూపిస్తూ, సర్వే నంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నారు. ఇప్పటికే ఇమ్రాన్ అనే వ్యక్తి ఒక ఎకరంన్నర భూమిని తన ఆధీనంలోకి తీసుకోగా, అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మరో 5 ఎకరాల్లో జరిగిన ఆక్రమణలను కూడా హైడ్రా అధికారులు విజయవంతంగా తొలగించారు. ముఖ్యంగా మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న చెరువు కట్టపై నిబంధనలకు విరుద్ధంగా మట్టి పోసి నిర్మించిన 18 షెట్టర్లను బుల్డోజర్లతో కూల్చివేశారు.

ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందన్న సమాచారం అందగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ల గుట్టు రట్టు చేశారు. కేవలం కూల్చివేతలతోనే ఆగకుండా, స్వాధీనం చేసుకున్న 43 ఎకరాల భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఇక్కడ అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *