Hydra: హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఒక పాత భవనంలో నిన్న రాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్విపాకం తాలుకూ భద్రతా లోపాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కఠినంగా స్పందించారు.
ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ –
“గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠం కావాలి. 17 అమాయకుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇది పూర్తిగా నిర్లక్ష్యమే.” అని అన్నారు.
పురాతన భవనాలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫైరుసేఫ్టీ నిబంధనలను పట్టించుకోకపోవడం, అలాగే సంబంధిత అధికారుల తనిఖీలు సమర్ధవంతంగా జరగకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందనీ, త్వరలోనే పాత భవనాలకు సంబంధించి ఫైరుసేఫ్టీ మార్గదర్శకాలు రూపొందించి, వాటిని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్టు వెల్లడించిన కమిషనర్, ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ భవనాల భద్రతపై ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు.