Miss World Pageant: ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 అందాల పోటీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4 నుండి 31 వరకు జరిగే ఈ పోటీలో, గ్రాండ్ ఫినాలేతో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో అనేక అనుబంధ కార్యక్రమాలు కూడా జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 140 దేశాల నుంచి అందాల రాణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
ఈ గ్లోబల్ ఈవెంట్ నిర్వహణకు హోస్ట్ నగరంగా దుబాయ్‌తో గట్టి పోటీ జరిగినా, చివరికి హైదరాబాద్ విజయం సాధించింది. నగరం యొక్క చారిత్రక వైభవం, సాంస్కృతిక ప్రత్యేకతలు, గ్రామీణ ప్రాంతాల అందం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు వంటి అంశాలు హైదరాబాద్‌కు అనుకూలంగా మారాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెరుగైన వాతావరణం, హైదరాబాద్‌ను విద్యా, ఔషధ కేంద్రంగా గుర్తించడం కూడా ఈ ఎంపికలో కీలకపాత్ర వహించాయి.
Also Read: Hyderabad: ఓ మై గాడ్..హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్..
మిస్ వరల్డ్ ఛైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లి, తెలంగాణ పర్యాటక & సంస్కృతి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సభర్వాల్ ఈ అంశాలను వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి గొప్ప పోటీని హైదరాబాద్‌కు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయని స్మితా సభర్వాల్ తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు పెద్దఎత్తున ప్రచారం లభించడంతో పాటు, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.